Automobile Sector: ఆటోమొబైల్ రంగంలో అపార అవకాశాలు.. 6 d ago

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న పరిశ్రమ ఆటో పరిశ్రమ. ఈ ఆటో పరిశ్రమకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే కోర్సే ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్. ప్రధానంగా సర్క్యూట్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇంజిన్ ప్రిన్సిపుల్స్, పవర్ ట్రైన్ సిస్టమ్స్, ఆటోమోటివ్ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్, స్టీరింగ్ అండ్ సస్పెన్షన్, ఫ్యూయల్ అండ్ ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హీట్ ట్రాన్స్‌ఫర్ వంటి అంశాలపై శిక్షణనిస్తారు. ఈ క్రమంలో నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యేనాటికి వాహనాల డిజైన్, డెవలప్‌మెంట్, ప్లానింగ్, మెయింటెనెన్స్, ఆర్ అండ్ డీ వంటి అంశాల్లో నైపుణ్యం సాధిస్తారు.
ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అనేది కార్లు, ట్రక్కులు, మోటార్ సైకిళ్లు ఇతర రవాణా వ్యవస్ధల వాహనాల రూపకల్పన, అభివృద్ధికి సంబంధించినది. ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆటోమోటివ్ ఇంజినీరింగ్ లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. ఆటోమోటివ్ ఇంజినీరింగ్ అనేది సాధారణంగా వాహనాలకు శక్తినిచ్చే మరియు నియంత్రించే వ్యవస్థలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. అయితే ఆటోమొబైల్ ఇంజినీరింగ్ మొత్తం వాహన రూపకల్పన, ఉత్పత్తి మరియు దాని నిర్వహణ వ్వవస్ధలను కలిగి ఉంటుంది.
ప్రవేశం ఇలా....
ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చదవాలనుకున్నావారు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (MPC) చదివి కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఏపీ ఈఏఎమ్‌సెట్ రాయాల్సి ఉంటుంది. జాతీయస్ధాయిలో జేఈఈ రాయాల్సి ఉంటుంది. ఇందులో ప్రవేశాలు ఇంటర్మీడియట్ మెరిట్‌తో పాటు ప్రవేశ పరీక్ష స్కోర్ ఆధారంగా ఉంటుంది. వీటిలో అర్హత సాధించిన వారు బీఈ/బీ.టెక్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చదవచ్చు.
నైపుణ్యాలు:
కెరీర్‌ను ఈ రంగంలో కొనసాగించడానికి విద్యార్ధులు వాహన డైనమిక్స్, మెకానికల్ సిస్టమ్స్, కాడ్, మెటీరియల్ సైన్స్‌లో అవగాహన, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వినియోగదారుల డిమాండ్‌కు తగ్గట్లు కొత్త సాంకేతికతలను ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. ఈ రంగంలో స్ధిరపడాలనుకుంటే డిజైన్, డ్రాయింగ్‌పై ఆసక్తి, న్యూమరికల్, ప్రాబ్లం సాల్వింగ్ వంటి నైపుణ్యాలు అవసరం.
అవకాశాలు:
దేశంలోకి పలు విదేశీ ఆటోమొబైల్ సంస్ధలు ప్రవేశిస్తుండటం, వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ ఇంజనీర్లకు గిరాకీ పెరుగుతోంది. ప్రధానంగా బజాజ్, హీరోహోండా వంటి ద్విచక్ర వాహన తయారీ సంస్ధలతోపాటు మారుతి సుజుకి, అశోక్ లేల్యాండ్, జీఎం, ఎస్‌కార్ట్స్, వంటి కార్ల తయారీ సంస్ధల్లో కూడా అవకాశాలు లభిస్తున్నాయి.
ఇది చదవండి: ఉన్నత విద్యతో పాటు ...ఉద్యోగం కూడా మీ సొంతం..